Stray Dogs: అమ్మపక్కన నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క.. చివరకు..

28 Feb, 2023 18:17 IST|Sakshi

జైపూర్‌: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది.

ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు.  అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు.

మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది.
చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్‌, హాంకాంగ్‌లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్..

మరిన్ని వార్తలు