‘ఆశ’ వదులుకోలేదు: స్వీపర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..

17 Jul, 2021 07:48 IST|Sakshi

రోజూ ఎన్నో సక్సెస్‌ స్టోరీలు చూస్తుంటాం. వాటిలో చాలామట్టుకు చిన్నస్థాయి నుంచి పెద్ద విజయాలు అందుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. తమ కష్టపుకథలు మరికొందరిలో  స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే.

జైపూర్‌: ఆశ కందారా.. మూడు రోజుల వరకు జోధ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేసిన ఒక స్వీపర్‌. 2016 నుంచి కాంట్రాక్ట్‌ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పన్నెండు రోజుల క్రితమే పర్మినెంట్‌ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి మంగళవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి.


 
భర్త వదిలేయడంతో.. 
1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్‌ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టెంపరరీ స్వీపర్‌ పోస్టులకు ఎగ్జామ్‌ రాసి క్వాలిఫై అయ్యింది.

మలుపు తిప్పిన సెల్యూట్‌
ఆశకు ప్రేరణ తన పైఅధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్‌స్పెక్షన్‌కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్‌ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్‌ఏఎస్‌ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్‌ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె.


మేయర్‌ కుంతి దియోరా నుంచి అభినందనలు అందుకుంటున్న ఆశ

మరిన్ని వార్తలు