దావత్‌, బరాత్‌లతోనే లొల్లిలు, విషాదాలు.. ఇక అక్కడ మందేసినా.. చిందేసినా ఫైన్‌ కట్టాల్సిందే!

31 Jan, 2022 11:50 IST|Sakshi

పెళ్లిళ్లలో దావత్‌లు, ధూమ్‌ధామ్‌ డ్యాన్సుల బరాత్‌లు సర్వసాధారణం. ఇందుకు ఎవరూ అతీతులు కారు. ప్రత్యేకించి కరోనా టైంలోనూ వీటిని వీడడం లేదు జనాలు.  అలాంటిది వీటిని అనవసర ఖర్చుల కింద భావించిన ఓ ఊరు.. వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  


రాజస్థాన్‌లోని బన్‌స్వరా పరిధిలోని గోడీ తేజ్‌పూర్‌ గ్రామం. తాజాగా పెళ్లిళ్లలో మందు, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి వల్లే వేడుకల్లో విషాదాలు, గొడవలు జరుగుతున్నాయని, అంతేకాదు వాటి వల్ల ఇరుకుటుంబాలు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి ఖర్చు చేసేది అనవసరమైన ఖర్చుగా పేర్కొంటున్నారు ఆ గ్రామ పెద్దలు. ఈ మేరకు నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. 

ఇక నుంచి వివాహ వేడుకల్లో ఈ రూల్‌ను ఉల్లంఘించిన వాళ్లకు.. మద్యం సేవిస్తే 21,000రూ., డీజే, నృత్యాలు చేస్తే 51 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరి మాజీ, ప్రస్తుత సర్పంచ్‌ల సమక్షంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 13 వార్డ్‌ మెంబర్స్‌, జిల్లా పరిషత్‌, పంచాయితీ సమితి సభ్యులు, గ్రామస్తులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. 

సర్వ సమాజ్‌ పేరుతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్థులందరితో రిజిస్టర్‌లో సంతకాలు తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కాపీ నకలును ధన్‌పూర్‌ పోలీసులకు సైతం అందించారు. సోషల్‌ మీడియాలో ఈ గ్రామ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు