రాజస్థాన్ సీఎం కీలక ప్రకటన.. వారికి రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌

19 Dec, 2022 18:13 IST|Sakshi

జైపూర్‌: దేశంలో వంట గ్యాస్‌ ధరలు ఆకాశన్నంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సిలిండర్‌ ధరను రూ.500లకు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

‘వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్‌పీజీ కనెక్షన్లు, స్టౌవ్‌ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.’ అని పేర్కొన్నారు.

మరోవైపు.. వచ్చే ఏడాదిలో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్‌ అమలు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు