అమ్మ..నాన్నను చంపేశాడు.. ఏమీ ఎరుగనట్లు మంచం మీద పడుకుని..

29 Nov, 2022 07:50 IST|Sakshi

సాక్షి, చెన్నై: కనిపెంచిన తల్లిదండ్రులను.. వృద్ధులనే కనికరం కూడా లేకుండా ఓ కుమారుడు కిరాతకంగా హతమార్చాడు. వారి మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. చివరకు దుర్వాసన రావడంతో ఈ హత్య సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభ కోణం సమీపంలోని పట్టీశ్వరం గ్రామానికి చెందిన గోవిందరాజ్‌(80), లక్ష్మీ(73) దంపతులకు  ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండేవారు.

పెద్దకుమారుడు రవిచంద్రన్‌ అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ప్రమాదం రూపంలో గతంలో మరణించాడు. ఇక, కుమార్తె గీత పెళ్లయిన కొన్నాళ్లకు మరణించింది. రెండో కుమారుడు రాజేంద్రన్‌(45)కు వివాహం కాలేదు. ఇతడు తల్లిదండ్రులతో కలిసి తిల్లయంబూరులో నివాసం ఉన్నాడు. తనకు పెళ్లి కాలేదన్న వేదనతో మానసికంగా కృంగి ఓ రోగిగా మారాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. వారిద్దరిని చితక్కొట్టేవాడు. మళ్లీ పశ్చాత్తాపంతో వారి వద్దే ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం తల్లిదండ్రులతో అతడుగొడవ పడ్డ శబ్దం ఇరుగు పొరుగు వారి చెవిన పడింది. అయితే, రోజు జరిగే గొడవే కాదా..? అని మిన్నుకుండి పోయారు. 

చదవండి: (పెళ్లయి 13 రోజులే.. బెడ్‌రూంలో ఉరేసుకుని నవవధువు..)

ఏమీ ఎరగనట్లు.. 
ఈ గొడవలో రాజేంద్రన్‌ ఉన్మాదిగా మారిపోయాడు. ఇంటిలో ఉన్న వేట కొడవలితో తల్లిదండ్రులు ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశాడు. తల,కాలు, చేతులపై ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఆ ఇద్దరు మరణించడంతో ఆందోళన చెందాడు. అయితే, ఏమీ ఎరుగనట్లుగా ఆ మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. ఉదయాన్నే నిద్ర లేవడం స్నానం చేయడం, పంచే, చొక్క ధరించడం ఇంట్లో ఉన్న ఏదో ఆహారం తింటూ బయటి వ్యక్తులకు కనిపించాడు. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ సోమవారం ఉదయం తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. అదే సమయంలో ఇంటి తలుపులన్నీ రాజేంద్రన్‌ మూసివేశాడు. సమాచారం అందుకున్న పట్టీశ్వరం పోలీసులు రాజేంద్రన్‌ ఇంటి తలుపులు పగుల కొట్టి లోనికి వెళ్లారు. అక్కడి దృశ్యాలు పోలీసులను ఆందోళనలో పడేశాయి. తల్లిదండ్రులను అతి కిరాతకంగా నరికి చంపేసి ఏమీ ఎరుగనట్లు మంచం మీద పడుకుని ఉన్న రాజేంద్రన్‌ను గుర్తించారు.

అతడిని విచారించగా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లోనే మృతదేహాలతో పాటే ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుంభకోణం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం రాజేంద్రన్‌ను అరెస్టు చేసి ప్రశి్నస్తున్నారు.   

మరిన్ని వార్తలు