జనవరిలో కొత్త పార్టీ.. గెలుపు మాదే: రజనీకాంత్‌

3 Dec, 2020 12:40 IST|Sakshi

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృత‍జ్ఞతలు తెలిపారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో సోమవారం రజనీకాంత్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘మా అభిప్రాయాలను పంచుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామనే భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని రజనీ వెల్లడించారు. ఈ క్రమంలో నేడు పార్టీ ప్రారంభం గురించి ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులుగా తమదైన ముద్రవేసిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వనాయకుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు మరింత ఉధృతమయ్యాయి. ఇక కమల్‌ ఇప్పటికే మక్కల్‌ నీది మయ్యం పేరిట పార్టీ స్థాపించగా.. 2017 డిసెంబరులో ‘అరసియల్‌కు వరువదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అని బహిరంగంగా ప్రకటించిన తలైవా అనేక పరిణామాల అనంతరం పార్టీ స్థాపన దిశగా పయనించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు