డీఎంకేలోకి తలైవా టీం .. చెప్పే వచ్చాం.. 

18 Jan, 2021 06:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: రజనీ మక్కల్‌ మండ్రంకు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు  ఆదివారం డీఎంకేలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు. త్వరలో మరి కొందరు మక్కల్‌ మండ్రం నుంచి బయటకు రాబోతున్నట్టు ఈ కార్యదర్శులు ప్రకటించారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ పెడతా రని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాలతో రాజకీయాలు లేవు, పార్టీ లేదు అని తలైవా ప్రకటించేశారు. ఇది ఆయన అభిమానులకే కాదు, రజనీ మక్కల్‌ మండ్రంలో సేవల్ని అందిస్తూ వచ్చిన వారికి పెద్ద  షాక్కే.

saఆయన్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు కొందరు పోరాటాల బాట పట్టినా తాను మాత్రం రానంటే రాను అని రజనీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రజనీతో రాజకీయపయనం సాగించాలన్న ఆశతో ఉన్న ఆయన అభిమాన సంఘం నేతలు , తలైవా నిర్ణయంతో ఇక తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. శు›క్రవారం కృష్ణగిరి రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి మది అలగన్‌ డీఎంకేలో చేరగా, ఆదివారం మరో మూడు జిల్లాల కార్యదర్శులు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.  

వలసలు తథ్యం.. 
తూత్తుకుడి జిల్లా రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి జోషఫ్‌ స్టాలిన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్‌ సెల్వానంద్, తేని కార్యదర్శి గణేషన్‌ తమ మద్దతుదారులతో కలిసి ఆదివారం ఉదయం తేనాం పేటలోని డీఎంకే కార్యాలయానికి వచ్చారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ సమక్షంలో ఈ ముగ్గురు నేతలు డీఎంకేలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి స్టాలిన్‌ ఆహా్వనించారు. ఈ ముగ్గురి  మద్దతుదారులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి చేరిక కార్యక్రమం జరిగింది.  స్టాలిన్‌ ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో 200 కాదు, 234 నియోజకవర్గాల్ని డీఎంకే కూటమి కైవసం చేసుకోవడం ఖాయం అన్నట్టు ధీమా వ్యక్తం చేశారు.  తాము అధికారంలోకి రాగానే రుణమాఫీతో పాటు వృద్ధాప్య పింఛన్‌ సక్రమంగా అందే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు.  

చెప్పే వచ్చాం.. 
డీఎంకేలో చేరబోతున్నట్టుగా రజనీ మక్కల్‌ మండ్రం పెద్దలతో చెప్పే వచ్చినట్టు ఆ మూడు జిల్లాల కార్యదర్శులు పేర్కొన్నారు. తమ అభిమాన నాయ కుడు రజనీ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూశామని, ఆరోగ్య సమస్యలను పరిగణించాల్సి ఉందన్నారు. రాజకీయ పయనం రజనీతో సాధ్యం కాదని తేలడంతో డీఎంకేలోకి చేరామని తెలిపారు. తాము డీఎంకేలో చేరబోతున్నట్టుగా రజనీ మక్కల్‌ మండ్రం పెద్దలకు తెలియజేశామని, వారు ఎవరి ఇష్టం వారిది అని సూచించారని పేర్కొన్నారు. త్వరలో మరి కొంత మంది రజనీ మక్కల్‌ మండ్రం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. తమ లక్ష్యం డీఎంకేను అధికారంలోకి తీసుకురావడమేనని పేర్కొన్నారు. 

వీడియో వైరల్‌..... 
ఉదయాన్నే ట్రాక్‌ షూట్, హెల్మెట్‌ ధరించి స్టాలిన్‌ స్పోర్ట్స్‌ సైకిల్‌ తొక్కుతూ దూసుకెళ్తున్న వీడియో ఒకటి ఆదివారం వైరల్‌గా మారింది. ఆరోగ్య సంరక్షణలో  ముందుండే స్టాలిన్‌ ఈ వీడియోలో ఎలాంటి భద్రత లేకుండా, కేవలం సైక్లింగ్‌ చేసే వారితో కలిసి స్టాలిన్‌ ముందుకు సాగడం, రోడ్డుపై వెళ్తున్న వారికి అభివాదం తెలియజేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు