Tamil Nadu: ‘ఆ ఏడుగురి విడుదలకు వ్యతిరేకం’

22 May, 2021 06:53 IST|Sakshi

టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి స్పష్టీకరణ 

సాక్షి ప్రతినిధి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు ఎంత మాత్రం ఆ మోదం కాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తెలిపారు. నేరస్తులకు శిక్ష వేయడం న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం, వత్తిళ్లు తగదని పేర్కొన్నారు. జైళ్లలో ఏడుగురే కాదు.. వందమందికి పైగా తమిళులు ఉన్నారని వ్యాఖ్యానించారు.  

30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని కోరుతూ 2018లో రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రాష్ట్రపతికి ఈనెల 20వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై సైదాపేటలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తదితర కాంగ్రెస్‌ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి రాసిన లేఖపై స్పందించారు.

రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 21వ శతాబ్దాన్ని పురస్కరించుకుని అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. అవి యువతకు ఎంతో ఉపకరించాయన్నారు. సమాచార వ్యవస్థ సైతం కొంతపుంతలు తొక్కిందని పేర్కొన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్‌ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని సైతం పరుగులు పెట్టించి తమిళుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.

అలాంటి నేతను హత్య చేసిన ఏడుగురు తమిళ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు సమ్మతం కాదన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వంద మందికి పైగా తమిళ ఖైదీలు 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. తమిళులు అనే భావనతో ఏడుగురిని మాత్రమే విడుదల చేయాలని కోరడం సబబుకాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడుగురు తమిళుల విడుదల అంశాన్ని డీఎంకే తన మేనిపెస్టోలో పొందుపరిచిందని, ఆ విషయౖమై డీఎంకేను కాంగ్రెస్‌ ఎలాంటి వత్తిడి చేయలేదని ఆయన వివరించారు.
చదవండి: రాజీవ్‌ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్‌

మరిన్ని వార్తలు