నళినికి నెల రోజుల పెరోల్‌

24 Dec, 2021 06:22 IST|Sakshi

సాక్షి, చెన్నై: రాజీవ్‌హత్య కేసులో దోషి నళినికి నెల రోజులు పెరోల్‌ మంజూరైంది. ఈ కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్‌ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసినా రాజ్‌భవన్‌ నుంచి నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్‌ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఈ దశలో కూతురు తనతో ఉండాలని కోరుకుంటున్నానని, పెరోల్‌ మంజూరు చేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ గురువారం న్యాయమూర్తులు వీఎన్‌ ప్రకాష్, ఆర్‌. హేమలత బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చింది. నళినికి నెల రోజులు పెరోల్‌ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్‌ మంజూరైంది.

>
మరిన్ని వార్తలు