రాజీవ్‌ హత్య కేసు: రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష

6 Feb, 2021 07:25 IST|Sakshi

రాజ్‌భవన్‌ వర్గాల వెల్లడి 

రాజీవ్‌ హత్య కేసులో ఖైదీల విడుదలపై ఎటూతేలని వైనం 

డీఎంకే డ్రామా : సీఎం ఎడపాడి విమర్శ 

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఖైదీల విడుదల అంశం రాజ్‌భవన్‌ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సుప్రీం కోర్టు ఇచ్చి న వారంరోజుల గడువు పూర్తయినా నేటికీ ఎటూ తేలని వ్యవహారంగా మారిపోయింది.

సాక్షి, చెన్నై : రాజీవ్‌ హత్య కేసులో వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితుల్లో ఒకరైన పేరరివాళన్‌ తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జడ్జి నాగేశ్వరరావు నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్‌ గత నెల 21న విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. పేరరివాళన్‌ సహా ఏడుగురు ఖైదీల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌ 9న సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానంపై గవర్నర్‌ మూడు లేదా నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పా రు. సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకూడదా అని జడ్జి నాగేశ్వరరావు ప్రశ్నకు అవసరం లేదని తుషార్‌ మెహతా బదులిచ్చారు. విచారణను రెండు వారా లు వాయిదా వేయాలని పేరరివాళన్‌ తరఫు న్యా యవాది కోర్టును కోరా రు. దీనిపై జడ్జి స్పంది స్తూ తమిళనాడు గవర్నర్‌ నిర్ణ యం వరకు వేచిచూద్దామని తెలిపారు.

మూడు లేదా నాలుగు రోజుల్లో గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పిన మాటలను రికార్డు చేస్తున్నామని చెప్పి విచారణను రెండు వారాలకు వాయిదా వేశా రు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసింది. అందులో ‘పేరరివాళన్‌ క్షమాభిక్షకు సంబంధించిన అన్ని పత్రాలను గవర్నర్‌ పరిశీలించారు. ఈ విషయంలో రాష్ట్రపతికి మాత్రమే పూర్తి అధికారం ఉంది. చట్ట ప్రకారం ఆయన తగిన నిర్ణయం తీసుకుంటారు.’ అని ఉంది. దీంతో పేరరివాళన్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. రాజీవ్‌ హత్య కేసులో ఖైదీల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు పట్టుపడుతున్నాయి. గవర్నర్‌ తనకు అధికారం లేదని తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం రాజ్‌భవన్‌ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది.
 

మరిన్ని వార్తలు