Rajiv Gandhi Assassination Case: రాజీవ్‌గాంధీ హత్యకేసులో జయలలిత అసాధారణ నిర్ణయం..

12 Nov, 2022 21:29 IST|Sakshi

లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్‌ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్‌ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్‌ మద్రాస్‌ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్‌ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్‌ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట.

ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్‌ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్‌ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్‌ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్‌గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. 

ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్‌ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్‌ బెంచ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. 

చదవండి: (రాజీవ్‌ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?)

నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 

1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్‌గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్.  ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. 

మరిన్ని వార్తలు