మతం మారడాన్ని ప్రోత్సాహించను: రాజ్‌నాథ్‌ సింగ్‌

30 Dec, 2020 14:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి పేరుతో జరుగుతున్న మతమార్పిడిలపై చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. యూపీ, మధ్యప్రదేశ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ని కూడా తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివాహం కోసం జరిగే మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా తాను ఇలాంటి వాటిని సమర్థించనని స్పష్టం చేశారు. న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐతో ఇంటర్వ్యూలో భాగంగా రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసలు మతం ఎందుకు మారాలి. సామూహిక మత మార్పిడి వ్యవహారాలు ఆగిపోవాలి. నాకు తెలిసినంత వరకు ముస్లిం మతం ఇతర మతస్తులను వివాహం చేసుకోవడానికి అంగీకరించదు. ప్రస్తుతం అనేక కేసుల్లో కేవలం వివాహం కోసం.. బలవంతంగా.. చెడు ఉద్దేశంతో మత మార్పిడి జరుగుతుంది. సహజ వివాహ ప్రక్రియకు.. ఈ బలవంతపు మత మార్పిడి వివాహ తంతుకు చాలా తేడా ఉంది. ఇందుకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తోన్న ప్రభుత్వాలు ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాయి అని భావిస్తున్నాను. నా వరకు మత మార్పిడిలను నేను ప్రోత్సాహించను’ అన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. (చదవండి: యోగికి షాకిచ్చిన ఐఏఎస్‌ అధికారులు)

ఇక ఈ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌ రైతుల ఉద్యమం, చైనా-భారత్‌ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలపై మాట్లాడారు. తాను ఓ రైతు బిడ్డనని.. వారి కష్టం తనకు బాగా తెలుసన్నారు. అలానే మోదీ ప్రభుత్వం అన్నదాతలకు మేలు చేస్తుంది తప్ప నష్టం చేకూర్చదని స్పష్టం చేశారు. ఇక చైనాతో చర్చలు కొనసాగుతన్నప్పటికి పెద్దగా ఫలితం లేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

మరిన్ని వార్తలు