101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం

9 Aug, 2020 11:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ‌సింగ్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్‌ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్‌ తెలిపారు.

ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డీఆర్‌డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు.  భారత్, చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో క్రమంగా దిగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.(రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు)

రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాను భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించిన తరువాత తయారు చేసినట్లు రక్షణ మంత్రి చెప్పారు. ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ మధ్య సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ .4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నారు.

>
మరిన్ని వార్తలు