వచ్చే 10–12 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్‌–3లో ఉండాలి

25 Jun, 2021 10:41 IST|Sakshi

దేశ నావికా దళ శక్తిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

కర్వార్‌(కర్ణాటక): కర్ణాటకలోని కర్వార్‌లో అభివృద్ధి చేస్తున్న నేవల్‌ బేస్‌ ఆసియాలోనే అతిపెద్దది కానుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ‘ప్రాజెక్టు సీ బర్డ్‌’కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైతే బడ్జెట్‌ను మరింత పెంచుతామన్నారు. వచ్చే 10–12 ఏళ్లలో భారత నావికా దళం ప్రపంచంలోనే టాప్‌–3లో నిలిచేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. కర్వార్‌లో గురువారం ఆయన నేవీ అధికారులు, నావికులనుద్దేశించి మాట్లాడారు. కర్వార్‌ నేవీ బేస్‌ పనులు పూర్తయితే, దేశ రక్షణ సన్నద్ధత బలోపేతం కావడమే కాదు, దేశం వాణిజ్యపరంగా, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, ఇతర దేశాలకు మానవతా సాయం అందించే అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

‘ఈ బేస్‌ దేశంలోనే అతిపెద్దదిగా అవతరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆసియాలోనే ఇది అతిపెద్ద నేవీ బేస్‌ కావాలనేది నా ఆకాంక్ష. ఇందుకోసం అవసరమైతే బడ్జెట్‌ను మరింత పెంచేందుకు కృషి చేస్తాను’అని ప్రకటించారు. ‘మిగతా వాటితో పోలిస్తే ఈ బేస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి సీ లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. దీని ద్వారా గతంతో పోలిస్తే నిర్వహణసామర్థ్యం మెరుగవుతుంది’ అని రాజ్‌నాథ్‌ చెప్పారు. కర్వార్‌ బేస్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న ఆయన..దీని వెనుక అధికారులు, నావికుల కృషి ఎంతో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్, నేవల్‌ స్టాఫ్‌ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌తో కలిసి కర్వార్‌ బేస్‌ను ఏరియల్‌ సర్వే చేశారు.

‘ప్రపంచంలోని మొదటి ఐదు శక్తివంతమైన నేవీల్లో భారత్‌ కూడా ఒకటి. వచ్చే 10–12 ఏళ్లలో టాప్‌–3లో ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలి’అని చెప్పారు. సముద్రతీరంతోపాటు దేశ భద్రతలో నేవీ సహకారం అపారమని ఆయన కొనియాడారు. దేశ భద్రతలో భవిష్యత్తులో కూడా నేవీ కీలకమనే విషయాన్ని రక్షణరంగంపై అవగాహన కలిగిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని మంత్రి చెప్పారు. గతంలో గోవా విముక్తి, ఇండో–పాక్‌ యుద్ధాల సమయంలోనూ నేవీ ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలోనూ నేవీ ప్రముఖంగా ఉందని చెప్పారు.

దేశానికి 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం, 1,100 దీవులు, 25 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఈఈజెడ్‌లు) ఉన్నాయన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన శక్తి సామర్ధ్యాలను పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 48 వరకు కొనుగోలు చేస్తుండగా వీటిల్లో 46 దేశీయంగానే నిర్మిస్తున్నవని చెప్పారు. దేశీయంగా రూపొందుతున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ త్వరలోనే నేవీలో చేరనుందని చెప్పారు. అనంతరం మంత్రి రాజ్‌నాథ్‌ కొచ్చిలోని సదరన్‌ నేవీ కమాండ్‌కు వెళ్లారు. ‘విక్రాంత్‌’ నిర్మాణ ప్రగతిపై శుక్రవారం అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.

చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు 

>
మరిన్ని వార్తలు