పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది: రాజ్‌నాథ్‌

2 Nov, 2020 18:51 IST|Sakshi

విపక్షాలు, పాక్‌ ప్రధానిపై విరుచుకుపడిన రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి  రాజనాథ్‌ సింగ్ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మీద విరుచుకుపడ్డారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులు పూర్తిగా కంట్రోల్‌లోనే ఉన్నాయన్నారు. భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయంటూ రాహుల్‌ గాంధీ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌ పీఎల్‌ఏ దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని తెలిపారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది. చైనా దళాలు భాతర భూభాగంలోకి ప్రవేశించాయనే వాదనలు పూర్తిగా నిరాధారమైనివి. ప్రస్తుతం చైనాతో కమాండర్‌ స్థాయి చర్చలు జరగుతున్నాయి. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో మాకు తెలీదు. కానీ మేం ప్రయత్నిస్తున్నాం అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని వివరాలను వెల్లడించలేం’ అని తెలిపారు. 

రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘1962 నుంచి 2013 వరకు ఏం జరిగింది అనే దాని గురించి వదిలేద్దాం. నేను దాని గురించి ఏం మాట్లాడను. ప్రస్తుతం మన దళాలు ఎల్‌ఏసీ వద్ద గొప్ప ధైర్యాన్ని చూపించాయి. చైనా సైన్యం మన భూభాగంలోకి ప్రవేశించారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. గల్వాన్‌ ఘర్షణ తర్వాత నేను మన సైనికులను కలిశాను. ప్రధానమంత్రి కూడా సైనికులను కలుసుకున్నారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేరు’ అన్నారు. (చదవండి: భగ్గుమన్న భారత్‌.. పీఓకే ఆక్రమణ..!)

అలానే పీఓకేలో భాగమైన గిల్గిత్‌ బాల్టిస్తాన్‌కు తాత్కలిక ప్రాంతీయ హోదా ఇవ్వడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన మండి పడ్డారు. గిల్గిత్‌ బాల్టిస్తాన్‌, పీఓకే భారతదేశానికి చెందినది. దాని స్థితిలో ఎటువంటి మార్పు మాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత పాక్‌ రగిలిపోతుంది. టెర్రర్‌ గ్రూపులు కూడా ఇలానే ఉన్నాయి. ఆ కడుపుమంటతో ఈ చర్యలకు దిగింది అన్నారు. అలానే పుల్వామా దాడి విషయంలో కూడా ఇమ్రాన్‌పై మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్తానే కారణం అన్నారు. 

మరిన్ని వార్తలు