‘అదానీ’పై అదే దుమారం

14 Feb, 2023 06:30 IST|Sakshi

తొలి విడత బడ్జెట్‌ సమావేశాలకు తెర.. మార్చి 13 నుంచి మలి విడత

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్‌ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్‌ చేయాలని నిర్ణయించాయి.

అనంతరం బీఆర్‌ఎస్‌ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్‌ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు.

విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. 

మరిన్ని వార్తలు