ఆధారాల్లేకుం‍డా ఆరోపించొద్దు.. ప్రతిపక్షాలకు రాజ్యసభ చైర్మన్‌ హితవు

13 Dec, 2022 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: సభలో తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని రాజ్యసభ సభ్యులకు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ హితవు పలికారు. అలాంటి ఆరోపణలు చేయడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమని తేల్చి చెప్పారు.

రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గత ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని, కానీ, కేవలం 23 మంది దోషులుగా తేల్చారని చెప్పారు. సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలుగజేసుకోవాలని సభాపతిని కోరారు.

దీంతో చైర్మన్‌ ధన్‌ఖడ్‌ స్పందించారు. సభలో ఎవరు ఏం మాట్లాడినా అది కచ్ఛితత్వంతో కూడినది అయి ఉండాలని సూచించారు. తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఆధారాలు లేని గణాంకాలను సభలో చెబుతామంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇష్టారీతిన తోచింది మాట్లాడడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమేనని ఉద్ఘాటించారు. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోమన్నారు. సభలో ఏదైనా ఆరోపణ చేసినప్పుడు చట్టబద్ధ∙డాక్యుమెంటేషన్‌ ఉండాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గోయెల్‌ మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఈడీ 3,000 సోదాలు చేసిందనడం పూర్తిగా అవాస్తవమని తేలి్చచెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. సంజయ్‌ స్పందిస్తూ.. అధికార పార్టీతో సంబంధాలున్న అవినీతిపరులపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.  

>
మరిన్ని వార్తలు