సభ సజావుగా సాగేందుకు సహకరించాలి

18 Jul, 2021 06:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు కోరారు. శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపక్షాల నేతలు తమ అభిప్రాయాలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. కోవిడ్‌ వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడాలని,  సంబంధిత అంశాలపై చర్చించాలని వెంకయ్య నాయుడు  కోరారు. వర్షాకాల సమావేశాల్లో 6 ఆర్డినెన్స్‌లతో కలిపి మొత్తం 29 బిల్లులను సభ ముందు ఉంచుతున్నామని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారని సమాచారం.  ఈ సమావేశానికి రాజ్యసభ నాయకుడు పీయూష్‌ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సహా  పలువురు మంత్రులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు