Rajya Sabha Polling: కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్‌ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!

10 Jun, 2022 13:54 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నిక‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో జేడీఎస్‌ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్‌ బేర‌సారాలు ఆడుతోందని ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయొద్ద‌ని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించారని మండిపడ్డారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని సిద్ధ‌రామ‌య్య కూడా ఇటీవ‌లే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చదవండి: సిగ్నల్‌ జంప్‌! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు

జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు సిద్ధ‌రామ‌య్య ఓ లేఖ రాశార‌ని వ‌స్తున్న వార్తలపై  కూడా కుమార‌స్వామి స్పందించారు. ‘సిద్ధ‌రామ‌య్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు తాను లేఖ రాయ‌లేద‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టికే ఆ లేఖ‌ను సిద్ధ‌రామ‌య్య ట్విట‌ర్‌లోనూ పోస్ట్ చేరు. నిన్న లేఖ రాశాన‌ని చెప్పిన సిద్ధ‌రామ‌య్య నేడు రాయ‌లేద‌ని అంటున్నారు. తన మాటలను ఆయనే కొట్టిపారేస్తున్నారు. ఈ తీరు ఆయ‌న ద్వంద్వ వైఖ‌రిని తెలియజేస్తుంది’ అని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు