ప్రజా ప్రయోజనాల కోసమే ఆస్తానా నియామకం

17 Sep, 2021 06:26 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ ఆస్తానాను నియమించడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించుకుంది. ఢిల్లీలో భిన్నమైన శాంతి భద్రతల సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసమే ఆయనను నియమించినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆస్తానా పెద్ద రాష్ట్రమైన గుజరాత్‌లో పనిచేశారని, భారీ స్థాయిలో పోలీసు బలగాలను నేతృత్వం వహించిన అనుభవజ్ఞుడని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా మిలటరీ దళాల్లో పని చేశారని వెల్లడించారు.

అలాంటి అపార అనుభవం ఉన్న అధికారి సేవలు ఢిల్లీలో అవసరమని భావించామని, అందుకే నగర పోలీసు కమిషనర్‌గా నియమించినట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.  ఆస్తానా సర్వీసు గడువును సైతం పొడిగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) కేడర్‌లో ప్రస్తుతం నిర్దేశిత అనుభవం ఉన్న అధికారులెవరూ అందుబాటులో లేరని వివరించారు. అందుకే తగిన అనుభవం కలిగిన గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన రాకేశ్‌ ఆస్తానాను నియమించినట్లు పేర్కొన్నారు. ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా అపాయింట్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ జూలై 27న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

మరిన్ని వార్తలు