ఎన్నికల్లో బీజేపీని ఓడించండి

14 Mar, 2021 03:39 IST|Sakshi
ఢిల్లీలోని తిక్రీ బోర్డర్‌ వద్ద ఎండను తట్టుకోవడానికి ఇల్లు నిర్మిస్తున్న దృశ్యం.

భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ పిలుపు

కోల్‌కతా, నందిగ్రామ్‌లో కిసాన్‌ మహా పంచాయత్‌  

కోల్‌కతా/నందిగ్రామ్‌:  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్‌లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాన్ని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

‘‘బీజేపీకి ఓటు వేయొద్దు. ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడతారు. మిమ్మల్ని భూమిలేని పేదలుగా మార్చేస్తారు. దేశాన్ని బడా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెడతారు. మీరు ఉపాధి కోల్పోతారు’’ అని ప్రజలను అప్రమత్తం చేశారు. బీజేపీ మోసాలకు మారుపేరని దుయ్యబట్టారు. ఆ పార్టీ సంపన్నుల పక్షపాతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి పక్షాన తాము ఉంటామన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు రైతులు, పేదల పక్షాన ఉంటారని రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు. కిసాన్‌ మహాపంచాయత్‌లలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

    పూర్తయిన ఇంట్లో సేదతీరుతున్న రైతులు

>
మరిన్ని వార్తలు