నా పరువు తీస్తున్నారు!

18 Sep, 2020 05:15 IST|Sakshi

డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదు

మీడియాలో దుష్ప్రచారాన్ని ఆపాలి

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రకుల్‌

న్యూఢిల్లీ:  రియా చక్రవర్తి డ్రగ్స్‌ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్‌ విచారించిన జస్టిస్‌ నవీన్‌ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్‌ కౌన్సిల్‌కు, న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్‌ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్‌ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు.  

ముందుగా ఫిర్యాదు చేయాల్సింది..
కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ వాదనలు వినిపించారు. రకుల్‌ కోరుకున్నట్లు ఇంజంక్షన్‌ లేదా బ్లాంకెట్‌ బ్యాన్‌ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్‌ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్‌ న్యాయవాది స్పందిస్తూ రకుల్‌ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్‌ కేసుతో లింక్‌ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్‌ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు