రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట

17 Sep, 2020 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్‌ చేసిందని పిటిషన్‌లో వివరించారు.

అంతేకాకుండా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు సైతం ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఇక రకుల్‌ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ న్యాయస్థానం.. కొంత ఊరట లభించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రకుల్‌పై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించింది. రకుల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌ శుక్లా బెంచ్‌  ఇవాళ విచారణ చేపట్టింది.(డ్రగ్‌ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు)

కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ఉన్నట్లు సోషల్‌ మీడియాతో సహా మీడియా ఛానల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా డ్రగ్‌ కేసులో సారా అలీ ఖాన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిమోన్‌ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో వెల్లడించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు