అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం

21 Aug, 2020 03:56 IST|Sakshi

అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే మూడు–మూడున్నరేళ్లలో మందిరం పూర్తవుతుందని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించే ట్రస్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. భారత్‌కు చెందిన అత్యంత పురాతన నిర్మాణ శైలితో పటిష్టంగా మందిర నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి ట్రస్ట్‌ వరుస ట్వీట్లు చేసింది. ‘‘ఎల్‌ అండ్‌ టీ సంస్థతో పాటుగా సీబీఆర్‌ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌ ఇంజనీర్లు మందిర నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షిస్తున్నారని, 36–40 నెలల్లో నిర్మాణం పూర్తయిపోతుందని ట్రస్ట్‌ తన ట్వీట్‌లో పేర్కొంది.

  భూకంపాలు, తుపాన్‌ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్‌ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది. 

మరిన్ని వార్తలు