అయోధ్య భూ కుంభకోణం ఆరోపణలు.. ట్రస్ట్‌ ఏం చెప్పిందంటే..

14 Jun, 2021 09:24 IST|Sakshi

లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ మేరకు భూముల కొనుగోలులో ట్రస్టుపై అవినీతి ఆరోపణలు చేశాయి యూపీలోని విపక్ష పార్టీలు. కేవలం 11 నిమిషాల్లో వ్యవధిలో రెండు స్టాంప్‌ పేపర్లను తెర మీదకు ట్రస్ట్‌ తెచ్చిందని.. ఈ ‍గ్యాప్‌లో 16 కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడిందనేది ఆప్, ఎస్పీ పార్టీల ప్రధాన ఆరోపణ. ఈమేరకు భూముల కుంభకోణం ఆరోపణలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో విచారణ జరిపిచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. ఈ నేపథ్యంలో ట్రస్ట్‌ స్పందించింది. 

అయోధ్య మందిరంపై రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేరు మీద ఆ ప్రకటనలో.. అమ్మకం కొనుగోలు పక్కాగా జరిగిందిని, కోర్టు ఫీజులు, స్టాంప్‌పేపర్‌ కొనుగోలు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగాయని పేర్కొంది. ఇక ప్రాపర్టీ డీలర్లలో ఒకరైన అన్సారీ అందుబాటులో లేకపోగా, మరో డీలర్‌ తివారీ తాను ఒకప్పుడు ఆ భూమి 2 కోట్లకు కొనుగోలు చేశానని, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అది పెరిగిందని, ప్రస్తుతం 20 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆ భూమిని.. రామమందిరం కోసమే 18.5 కోట్లకు ఇచ్చేశానని తెలిపాడు. 

ఈ ఏడాది చివరికల్లా.. 
ఇక ఆరోపణలపై ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఘాటుగానే స్పందించాడు.  ఈ దశలో వాళ్లకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మా పని మేం చేసుకుంటూ పోతాం అని తెలిపాడు. మార్చి 31 వరకు ట్రస్ట్‌ తరపున మూడు వేల 200  కోట్ల రూపాయల్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశామని, నాలుగు కోట్ల మంది 10 రూ. చొప్పున, మరో 4 కోట్ల మంది వంద రూపాయల చొప్పున, మిగతవాళ్లు వెయ్యి, అంతకంటే ఎక్కువ రూపాయలు విరాళాలు ఇచ్చారని, బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా మరో 80 కోట్ల రూపాయలు వచ్చాయని, లాక్‌డౌన్‌లేని టైంలో స్వయంగా వచ్చి కొందరు విరాళాలు ఇవ్వగా.. అది 60 లక్షల రూపాయల దాకా వచ్చిందని, ఆరోపణలు చేసేవాళ్ల కోసమే ఈ లెక్కలని సంపత్‌రాయ్‌ వెల్లడించారు. కాగా, అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం 2024 చివరికల్లా పూర్తవుతుందని ట్రస్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ కల్లా ఆలయ పునాది పనులు పూర్తవుతాయని, వెంటనే మొదటి అంతస్థు పనులు మొదలుపెడతామని ట్రస్ట్ వివరించింది. డిసెంబర్‌ నుంచి రెండో దశ పనులు మొదలుపెట్టి.. ప్రధాన ఆలయ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.  చదవండి: మ‌సీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా?

ఆరోపణలేంటంటే..
రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేత పవన్ పాండేలు ఆదివారం వేర్వేరు మీడియా సమావేశాలు నిర్వహించి ట్రస్ట్‌ మీద ఆరోపణలు చేశారు. అయోధ్యలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సంజయ్ సింగ్ ఆరోపించారు. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న చంపత్ రాయ్ ఆదేశాలతోనే ఈ రెండు చెల్లింపులు జరిగాయని కూడా ఆప్ నేత ఆరోపించారు.  మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పవన్ పాండే సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. కేవలం 10 నిమిషాల తేడాలోనే భూమి విలువను 10 రెట్లు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. భూమి విలువ రూ.2 కోట్లుగా 2021 మార్చి 18న రామ టెంపుల్ పేరుతో భూమి కొనుగోలు రిజిస్ట్రీ చూపిస్తోంది. కానీ, పది నిమిషాల తర్వాత రామాలయ ట్రస్టుకు, అమ్మకందారుకు మధ్య రూ.18 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది అని పవన్ పాండే చెప్పారు. రామమందిరం పేరుతో రామభక్తులను ట్రస్టు మోసగించిందని, భూముల కొనుగోలు డీల్ గురించి ఒక ట్రస్టీకి, అయోధ్య మేయర్‌కు తెలుసునని ఆరోపించారు.

మరిన్ని వార్తలు