శాంతి మన విధానం

15 Aug, 2020 03:30 IST|Sakshi

రెచ్చగొడితే తగిన జవాబిస్తాం

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చైనాకు రాష్ట్రపతి పరోక్ష హెచ్చరిక

గల్వాన్‌లోయలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు భరతమాత ముద్దుబిడ్డలు

కరోనాపై ముందుండి పోరాడుతున్న వారియర్స్‌కు సెల్యూట్‌

న్యూఢిల్లీ: భారత్‌ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో  సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు.

‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు.

గల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్‌ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్‌లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్‌ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు.
 
వైద్యులకు సెల్యూట్‌
కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్‌ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్‌ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్‌ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు.

2020 నేర్పిన పాఠం
2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్‌ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు.

ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు.  ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు.

రామాలయ నిర్మాణం గర్వకారణం
అయోధ్యలో ఆగస్ట్‌ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్‌ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు