భారీగా ఆలయ నిర్మాణం

1 Aug, 2020 06:37 IST|Sakshi
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న కళాకారుడు

ఆర్కిటెక్ట్‌ చంద్రకాంత్‌ సోమ్‌పుర వెల్లడి  

అహ్మదాబాద్‌/అయోధ్య: శ్రీరాముని జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల రామనామంతో పుర వీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. మందిర నిర్మాణానికి 5వ తేదీన భూమిపూజ చేస్తున్న నేపథ్యంలో మందిరం డిజైన్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. మొదట అనుకున్న దానికంటే రెట్టింపు సైజులో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగర శైలిలో మందిరం ఆకృతి ఉంటుంది.

గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ ఆకృతిలో మార్పులు చేశామని, గతంలో కంటే భారీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయాన్ని డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ చంద్రకాంత్‌ సోమ్‌పుర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ శిఖరంతో పాటు రెండు గోపురాలు ఉండేలా గతంలో మందిరాన్ని డిజైన్‌ చేశామని ఇప్పుడు వాటి సంఖ్య అయిదుకి పెంచినట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

30 ఏళ్ల క్రితమే మందిరానికి ఆకృతి  
ఆలయాల నిర్మాణంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులు ప్రఖ్యాతి వహించారు. ఒకప్పుడు సోమనాథ్, అక్షరధామ్‌ ఆలయంతో పాటు 200పైగా ఆలయాలకు వీరు డిజైన్‌ చేశారు. ఇప్పుడు ఆ వంశానికి చెందిన చంద్రకాంత్‌ సోమ్‌పుర (77) తన ఇద్దరు కుమారులతో కలిసి  రామ మందిర నిర్మాణానికి డిజైన్‌ రూపొందించారు. 30 ఏళ్ల క్రితమే విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు అశోక్‌ సింఘాల్‌ మందిరానికి డిజైన్‌ చేయాలని చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు.

ఆలయ విశిష్టతలు  
► ఉత్తరాది ఆలయాల్లో కనిపించే నాగర శైలిలో మందిరం ఉంటుంది.  గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది.  
► మూడు అంతస్తుల్లో నిర్మించే రామ మందిరంలో అయిదు గోపురాలతో మండపాలు,  శిఖరం ఉంటాయి.
► ఆలయం ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది.  
► 10 ఎకరాల స్థలంలో మందిరం, మిగతా 57 ఎకరాల్లో వివిధ సముదాయాలను నిర్మిస్తారు.
 
 
ఢిల్లీలో భారీ తెరలు ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో 5న జరిగే మందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌ గుప్తా చెప్పారు.


అయోధ్యలో భూమి పూజ రోజు పంచేందుకు మిఠాయిలు సిద్ధంచేస్తున్న దృశ్యం
   

మరిన్ని వార్తలు