రాముని విగ్రహం ఫొటోలు లీకు..! ప్రధాన పూజారి ఆగ్రహం

21 Jan, 2024 07:43 IST|Sakshi

లక్నో: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్‌ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు." అని తెలిపారు.

ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్‌ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని ఆచార్య సత్యేంద్ర దాస్‌ కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్‌ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది.

రేపు (జనవరి 22)న అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలో ప్రముఖ నేతలు హాజరుకావడానికి ఆహ్వానాలు అందాయి. దాదాపు 7,000 మంది హాజరుకానున్నారు. ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు.

ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం

>
మరిన్ని వార్తలు