ఇక మిగిలింది రాందాస్‌ అథవాలే ఒక్కరే!

10 Oct, 2020 08:12 IST|Sakshi
కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే(ఫైల్‌ ఫొటో)

ఎన్డీయే నుంచి దూరమైన బీజేపీ మిత్రపక్షాల మంత్రులు

న్యూఢిల్లీ: లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్‌ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్‌ సావంత్‌(శివసేన), హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌(శిరోమణి అకాలీదళ్‌) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్‌(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్‌ కన్నుమూత )

ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్‌ సావంత్, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా, పాశ్వాన్‌ మరణంతో కేబినెట్‌ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు