ఫడ్నవిస్‌ భార్యముందే రామ్‌దేవ్‌ గంధీ బాత్‌.. క్షమాపణ చెప్తాడా?

26 Nov, 2022 16:51 IST|Sakshi

ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబా రామ్‌దేవ్‌ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ రాందేవ్‌పై తీవ్రంగా స్పందించారు. 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్‌ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్‌దేవ్‌.. మహిళలను ఉద్దేశిస్తూ  చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్‌దేవ్‌ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా  నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్‌దేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు.  యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్‌ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్‌దేవ్‌పై మండిపడ్డారు. 

అలా మొదలైంది..  ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్‌ ప్రసంగిస్తూ..  మ‌హిళ‌లు చీర‌ల్లో బాగుంటార‌ని, స‌ల్వార్‌, సూట్స్‌లో కూడా బాగానే క‌నిపిస్తార‌ని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధ‌రించ‌కున్నా బాగుంటార‌ని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్‌ రౌత్‌, బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్‌ను సైతం ప్రశ్నించారాయన.

సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు..

మరిన్ని వార్తలు