అవ్వ... ఓటర్ల డేటా చోరీ

18 Nov, 2022 11:00 IST|Sakshi
చెలమ అనే సంస్థ సిబ్బంది ద్వారా ఓటర్ల డేటా చౌర్యం జరుగుతోందని ఆరోపణ

త్వరలో బెంగళూరు పాలికె ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఓటర్ల సమాచారం చోరీ అనే అంశంపై వేడి పుట్టించింది. సీఎం బొమ్మై ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ బెంగళూరులో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని కాంగ్రెస్‌ ఘాటుగా ఆరోపించింది. ఇవి నిరాధార ఆరోపణలని సీఎం తిరస్కరించారు.  

శివాజీనగర: ఓటర్ల సమాచారాన్ని బీజేపీవారు ప్రైవేట్‌ సంస్థతో అక్రమంగా సేకరించారని, ఇందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డేటా చౌర్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేయాలన్నారు.

చెలుమ అనే ప్రభుత్వేతర సంస్థ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డులిచ్చి ప్రభుత్వ అధికారుల్లా ప్రవర్తించి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ సంస్థ అయిన చెలుమ ఓటర్ల సమాచారాన్ని సేకరించడం ఎందుకు?, బూత్‌ స్థాయిలో అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనకున్న వ్యక్తులు ఓ మంత్రికి సన్నిహితులని పరోక్షంగా మంత్రి అశ్వత్థ నారాయణపై ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ కమిషనర్‌ ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు.  

నిరాధార ఆరోపణలు: సీఎం  
ఓటర్ల డేటా చోరీపై కాంగ్రెస్‌ ఆరోపణ నిరాధారమని, ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరుగుతుందని సీఎం బొమై్మ తెలిపారు.  బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యాన్ని ఎన్నికల కమిషన్, బీబీఎంపీ, స్థానిక సంస్థలు ఎన్‌జీఓలకు ఇస్తారు. 2008లో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నపుడు ఇలాగే ఇచ్చారని చెప్పారు. ఒక ఎన్‌జీఓకు ఎన్నికల కమిషన్, బీబీఎంపీ అనుమతినిచ్చింది. వారు దురి్వనియోగం చేశారనే ఆరోపణపై విచారణ చేయాలని సూచించానని తెలిపారు. కాంగ్రెస్‌వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 సర్వేకు అనుమతి ఇవ్వలేదు: ఈసీ  
బీబీఎంపీ వ్యాప్తిలో ఓటర్ల సర్వే నిర్వహించేందుకు ఏ సంస్థకు అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌ కుమార్‌ మీనా చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏ సంస్థకు సమీక్ష కు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వేతర సంస్థ చెలుమ కు ఓటర్ల జాగృతి అభియాన జరపడానికి అనుమతివ్వగా, ఆ సంస్థపై ఫిర్యాదు రావటంతో తక్షణమే బీబీఎంపీ ఎన్నికలాధికారి రద్దు చేశారని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారి గుర్తింపు కార్డు దుర్వినియోగం ఘటనలో మహాదేవపుర ఓటర్ల నమోదు అధికారి వైట్‌ఫీల్డ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారన్నారు.  

(చదవండి: మంటల్లో బ్యాంకు అధికారి...మొబైల్‌ ఫోన్‌ పేలడమా? ఆత్మహత్య?)

మరిన్ని వార్తలు