‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’

24 Aug, 2020 20:01 IST|Sakshi

కేంద్ర సర్కార్‌పై పోరాటానికి శ్రేణులకు సోనియా పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో సంస్ధాగత అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని, పార్టీ పునర్నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా పేర్కొన్నారు. సోమవారం సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలెవరిపైనా ఎలాంటి చర్యలూ ఉండవనీ, వారంతా తమ కుటుంబంలో భాగమని సోనియా వెల్లడించారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కుటుంబమని, పలు సందర్భాల్లో ఎన్నో విభేదాలు ఎదురైనా చివరికి తామంతా ఒక్కటిగా నిలిచామని సమావేశం చివరిలో సోనియా పేర్కొన్నారని సుర్జీవాలా చెప్పారు. దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం పార్టీ శ్రేణుల ముందున్నదని ఆమె చెప్పారని అన్నారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆమె మరికొన్ని నెలల పాటు పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియానే కొనసాగాలని పార్టీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే రాహుల్‌ సీనియర్‌ నేతల తీరును తప్పుపట్టారు.బీజేపీతో కలిసి కుట్రపూరితంగానే పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకు లేఖ రాశారని సీనియర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, ఆనంద్‌ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక సీనియర్‌ నేతలను అనునయించేందుకు వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని రాహుల్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చదవండి : సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు