మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు

21 Aug, 2021 08:40 IST|Sakshi

కచ్‌.. మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు. సరిహద్దు రాష్ట్రంలో ఓ సరిహద్దు జిల్లా. అరేబియా సముద్రం ఓ ఎల్ల.. పొరుగుదేశం పాకిస్థాన్‌ మరో ఎల్ల. ఇది జిల్లా అనే కానీ.. ఓ రాష్ట్రమంత విస్తారమైనది. ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఏటా మూడు నెలల వేడుకలు. గాంధీ పుట్టిన గుజరాత్‌ వైభవం ఇది.

సంగీతం, నాట్యం... వీటికి నేపథ్యంగా తెల్లటి ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఈ అద్భుతాన్ని చూడడానికే వచ్చినట్లు...ఆకాశం కిటికీకి ఉన్న మబ్బు తెరలు తీసి తొంగి  చూస్తున్నట్లు చంద్రుడు నిండుగా ఉంటాడు. పగలైతే సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ... తెల్లటి ఉప్పు మీద కిరణాల దాడి చేస్తుంటాడు. ధవళవర్ణంలోని ఉప్పు నేల ఏడురంగుల్ని ప్రతిఫలిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతి నైపుణ్యాన్ని తలవంచి ఆస్వాదించాల్సిందే తప్ప తలెత్తి చూడడం కష్టమే. తలెత్తడానికి కూడా బెదిరిపోయేటట్లు భయభ్రాంతుల్ని చేస్తుంటాడు భానుడు. ధైర్యం చేసి తలెత్తి చూస్తే ఏడురంగులు ఒకేసారి కళ్ల మీద దాడి చేస్తున్నట్లుంటాయి.

ఎప్పుడు వెళ్లవచ్చు!
గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ మహోత్సవ్‌ ఏటా శీతాకాలంలో మూడు నెలలపాటు జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌ 12 మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని అంచనా. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఉత్సవాలకు టూర్‌ ప్యాకేజ్‌లు ఉంటాయి. ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిండు పున్నమి రోజుల్లో కచ్‌ తీరంలో రాత్రి బస ఉండేటట్లు ప్లాన్‌ చేసుకుంటే టూర్‌ని ఆద్యంతం సమగ్రంగా ఆస్వాదించవచ్చు. 

ఏమేమి చూడవచ్చు!
ఉప్పు నేల మీద ఎర్రటి తివాచీ పరుచుకుని, ఎర్రటి తలపాగాలు చుట్టుకున్న కళాకారులు సంప్రదాయ గుజరాతీ కచ్‌ జానపద సంగీతాన్ని ఆలపిస్తుంటారు. మరోవైపు డాన్స్‌ ప్రదర్శనలు. ఇక హాండీక్రాప్ట్స్‌ విలేజ్‌లో అడుగుపెట్టగానే రంగురంగుల కుండల మీద చూపు ఆగిపోతుంది. కృష్ణుడు వెన్న దొంగలించిన కథనాలు కళ్ల ముందు మెదలుతాయి. కృష్ణుడికి అందకుండా ఉట్టి మీద పెట్టిన కుండలు గుర్తొస్తాయి. ఈ ట్రిప్‌కి గుర్తుగా ఒక్క కుండనైనా తెచ్చుకోవాలని మనసు లాగుతుంది. కానీ ఇంటికి చేరేలోపు పగిలిపోతుందేమోననే భయం ఆపేస్తుంది.

లెదర్‌ ఆర్టికల్స్, ఉడెన్‌ హ్యాండీక్రాఫ్ట్స్, కాపర్‌ బెల్స్‌ దొరుకుతాయి. ఇక దుస్తులైతే బాతిక్‌ ప్రింట్, అజ్రక్‌ ప్రింట్, రోగన్‌ వర్క్, సిల్వర్‌ వర్క్, మడ్‌మిర్రర్‌ వర్క్, కచ్‌ వర్క్‌ ఎంబ్రాయిడరీలు వందల రకాలు దేనికందే ప్రత్యేకం అన్నట్లుంటాయి. నిజానికి కచ్‌ అనే పేరు మనకు బాగా సుపరిచితమైనదే. ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్లకు కచ్‌ వర్క్‌లో నైపుణ్యం సాధించాలనే కల ఉంటుంది. ‘కచ్‌ వర్క్‌ వచ్చు’ అని చెప్పడంలో ఓ సంతోషంతోపాటు కొంత అతిశయం, మరికొంత ఆత్మవిశ్వాసం కూడా తొణికిసలాడుతుంటాయి.

ఒంటెబండి విహారం
మనకు ఒంటెద్దు బండి తెలుసు. ఇక్కడ మాత్రం ఒంటె బండి విహారం ప్రత్యేకత. హనీమూన్‌ కపుల్‌కి ఒంటె సవారీ, కుటుంబంతో వెళ్లిన వాళ్ల కోసం ఒంటెబండి సవారీ రెండూ ఉంటాయి. సూర్య కిరణాలు సోకి తెల్లగా మిలమిల మెరుస్తున్న ఉప్పు కయ్యల్లో ఒంటె పాదాల ముద్రలు పడుతుంటాయి. కొంత సేపటికే ఉప్పు కరిగి పాదముద్రలు మాయమైపోతాయి. మాండవి తీరాన ఒంటె సవారీ కూడా మంచి అనుభూతిగా మిగులుతుంది. ఒంటెబండి సవారీతోపాటు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఎక్కిస్తే పిల్లలకు ఈ టూర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సంతోషాన్నిచ్చినట్లే. 

మరిన్ని వార్తలు