ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లే కొడతారు: మంత్రి

10 Dec, 2020 16:05 IST|Sakshi

ముంభై: కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల వెనుక చైనా, పాక్ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు జరుగుతుండగా ఈ విషయంలో పొరుగు దేశాల ప్రస్తావన రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలపై  మహారాష్ట్ర మంత్రి బచ్చు కడు స్పందిస్తూ ‘‘ దేశ వ్యాప్తంగా రైతు ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు అన్నదాతలకు మద్దతు పలుకుతున్నారు. కానీ చైనా, పాక్‌ పేరు చెప్పి రైతులను అవమానించారు. ఇందుకు వాళ్లు దన్వే ఇంట్లోకి చొరబడి అతడిని కొట్టాలి. ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే ఆయన డీఎన్‌ఏ పాకిస్తాన్‌ లేదా భారత్‌లో ఉందా అని చెక్‌ చేయాల్సి వస్తుంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా మ‌హారాష్ట్రలోని జాల్నా జిల్లాలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దన్వే మాట్లాడుతూ... ‘ఇది రైతులు చేస్తోన్న ఆందోళన కాదు. దీని వెనక పాక్‌, చైనాల హస్తం ఉంది. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లింలను ప్రేరేపిస్తారు. గ‌తంలోనూ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, నేష‌న‌ల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజ‌న్స్ తీసుకువ‌చ్చిన స‌మ‌యంలో ముస్లింల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అమల్లోకి వస్తే ఆరు నెలల్లో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎంత మంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలి. ఆ సమయంలో విఫలమయ్యారు కాబట్టే మళ్లీ నూతన చట్టాల వల్ల నష్టం జరుగుతుందంటూ వారిని రెచ్చగొడుతున్నారు’’ అని పేర్కొన్నారు.

కాగా కొన్ని వారాలుగా పంజాబ్‌ , హర్యానాలోని వేల మంది రైతులు దేశ రాజధాని సరిహద్దు ప్రాంతంతో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల గురించి రైతుల ఆందోళనలు చల్లార్చేలా కేంద్రం గత కొన్ని వారాలుగా వ్యవసాయ సంఘ నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రైతు నాయకులు చట్టాలను సవరించే ప్రభుత్వ ప్రతిపాదనను బుధవారం తిరస్కరించారని వెల్లడించారు. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు దిగి జైపూర్-డిల్లీ , ఢిల్లీ-ఆగ్రా రహదారులను అడ్డుకుంటూ ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారని అన్నారు.

మరిన్ని వార్తలు