కర్ణాటక మఠాధిపతి లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు

4 Jan, 2023 19:10 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మఠాధిపతి శివమూర్తి మూరుగ లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై ఎలాంటి  లైంగిక దాడి జరగలేదని తేలింది. టీనేజ్‌ బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఇందులో బాలికలపై అత్యాచారం జరిగినట్లు  కనిపించలేదని.. వారి జననాంగాల్లో ఎలాంటి గాయాలు గుర్తించలేదని వెల్లడైంది.

కాగా 2019 నుంచి 2022 వరకు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావు స్వామిజీ తమను  లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆయన ఆశ్రమంలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. బాలికల ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసు స్టేషన్‌లో ఆగష్టు 26న శివమూర్తిపై పోక్సో కేసు నమోదైంది. తరువాత కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్‌ స్టేసన్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో మఠాధిపతికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి చిత్రదుర్గ జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కేసు నమోదు చేసిన రెండు రోజులకు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిత్రదుర్గలోని ఆశ్రమంలో  తమపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించిన మైనర్‌ బాలికల స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా మెడికల్‌ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఆ నివేదికను  ఫోరెన్సిక్‌ సైన్స్‌  ల్యాబ్‌కు(ఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపించారు. అయితే ఫైనల్‌ రిపోర్ట్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికపై ఆధారపడి ఉండనున్నట్లు వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు.  అయితే అక్టోబర్‌లో మరో నలుగురు బాలికలు శివమూర్తిపై ఇవే ఆరోపణలు చేశారు. కానీ వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. 
చదవండి: : డాక్టర్‌ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి..

మరిన్ని వార్తలు