యూపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్‌

28 Mar, 2022 16:18 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు కలిశారు. యోగి అసెంబ్లీలోకి రాగానే.. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేష్‌ కూడా తన సీటులోంచి లేచి యోగికి విష్‌ చేశారు.  ఒకరినొకరు షేక్‌ హ్యండ్‌ ఇచ్చుకొని అత్మీయంగా పలకరించుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న అఖిలేష్‌, యోగి.. ఇలా నవ్వుకుంటూ పలకరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ప్రమాణం చేశారు. 
చదవండి: బెంగాల్‌ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్‌

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు కైవసం చేసుకొని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా అందుకుంది. యోగి ఆదిత్యానాథ్‌ గోరఖ్‌పూర్‌ అర్భన్‌ స్థానం నుంచి, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ కర్హాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్‌ యాదవ్‌ అజంగఢ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ శనివారం ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు