ర్యాష్‌ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన కౌన్సిలర్‌ కొడుకు.. కానిస్టేబుల్‌పైనే దాడి!

29 Oct, 2022 17:19 IST|Sakshi

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు వాహనదారులు మాత్రం రూల్స్‌ బ్రేక్‌ చేస్తూనే ఉన్నారు. జరిమానాలు విధించినా ఏ మాత్రం మారడం లేదు. అంతేకాదు, తాజాగా కొందరు పోకిరీలు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఏకంగా ట్రాఫిక్‌ పోలీసుపైనే దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలంలో అస్తంపట్టి పోలీసు స్టేషన్‌లో అశోక్‌(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన డ్యూటీ ముగియడంతో అశోక్‌ బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఓ చోట ముగ్గురు వ్యక్తులు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ అశోక్‌కు కనిపించారు. దీంతో, అశోక్‌ వారి బైక్‌ను ఫాలో అయ్యి ఓ చోట ఆపాడు. అనంతరం, వారిని ఎందుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారంటూ నిలదీశాడు. ఈ సందర్భంగా రెచ్చాఇపోయిన యువకులు.. కానిస్టేబుల్‌ అశోక్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం, సివిల్‌ డ్రెస్‌లో ఉన్న అశోక్‌పై దాడి చేశారు. ముగ్గురు యువకులతో పాటు అక్కడే ఉన్న వారి మరో ఇద్దరు అనుచరులు కూడా అశోక్‌పై దాడికి తెగబడ్డారు. 

దీంతో, దాడి నుంచి తేరుకున్న అశోక్‌.. వారిలో నలుగురిని పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు