మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్‌.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే

26 Jun, 2022 12:51 IST|Sakshi

మహారాష్ట్రలో పొలిటికల్‌ డ్రామా పలు మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. దీంతో, సర్కార్‌ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. 

కాగా, పొలిటికల్‌ సంక్షోభం కొనసాగుతున్న వేళ మరో ట్విస్ట్‌ నెలకొంది. సీఎం ఉద్ధవ్‌ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యే సతీమణీలను ఆమె కలుస్తున్నారు. ఈ క్రమంలో రెబల్‌ ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో కీలక పరిణామం నెలకొంది. కాగా, రష్మీ థాక్రే తలపెట్టిన వినూత్న కార్యక్రమంలో ఎంత మేరకు ఉద్ధవ్‌ థాక్రేకు మేలు చేస్తుందో వేచి చూడాలి. 

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్‌ షిండే సహా 16 మంది శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు షాక్‌ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని గడువు విధించారు.

మరోవైపు.. మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహ‌తిలోని ఓ విలాస‌వంత‌మైన రిసార్ట్ లో క్యాంపు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిపై శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఫైరయ్యారు. గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారని ప్రశ్నించారు. కాగా, తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఆఫీసుల‌ను శివసేన కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను దేశద్రోహులుగా పేర్కొంటూ వారి కార్యాలయాలపై దాడులు చేస్తామని శివసేనకు చెందిన పూణె ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు సంజయ్ మోరే హెచ్చరించారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు భద్రత కల్పించి.. ముంబై, థానే జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు.. కేంద్రం కూడా రెబల్‌ ఎమ్మె‍ల్యేలకు భద్రతను పెంచింది. 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్‌’ సీఆర్‌పీఎఫ్‌ సెక్యూర్టీని కల్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

మరిన్ని వార్తలు