ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు 

30 Jun, 2021 01:11 IST|Sakshi

జూలై 31 కల్లా అమలు కావాలి  

వలస కార్మికులకు పోర్టల్‌ ఏర్పాటు చేయాలి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డాటా బేస్‌ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ‘వలస కార్మికుల సమస్యలు, కష్టాలు’పై సుమోటో కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతి వారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు, రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది.

అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ  సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కారి్మక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కారి్మకులకు రేషన్‌ సరుకుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకాలన్నీ జూలై 31 కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్‌ నేషన్‌–వన్‌ రేషన్‌ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది.

రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగించాలని పేర్కొంది.  వలస కార్మికులకు రేషన్‌ సరఫరా నిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకురావాలి.  ఆ మేరకు కేంద్రం అదనపు ఆహారధాన్యాలను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగిన పథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది. 

చదవండి: ఆకలి మంటల్లో కార్మికులు!

మరిన్ని వార్తలు