జూనియర్లను క్యూలో నిల్చోబెట్టి కొట్టిన సీనియర్లపై కేసు.. ఏడాది పాటు సస్పెండ్‌

31 Jul, 2022 19:56 IST|Sakshi

భోపాల్‌: ర్యాగింగ్ నెపంతో జూనియర్లను లైన్లో నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటనతో సంబంధం ఉ‍న్న ఏడుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జులై 28న మధ్యప్రదేశ్‌ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను వరుసగా నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టారు. వారితో దారుణంగా ప్రవర్తించారు. వద్దని చెప్పేందుకు వెళ్లిన హాస్టల్ వార్డెన్‌పైకి వాటర్ బాటిల్స్ విసిసారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి  విద్యార్థులా డాక్టర్లయ్యేది అని విమర్శలు వెల్లువెత్తాయి.

ర్యాగింగ్ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు ఏడుగురు సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం వీరందరినీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజ్‌ డీన్ ప్రకటించారు.

అంతకుముందు ఇండోర్‌లోని మ‌హాత్మాగాంధీ మెడిక‌ల్ కాలేజీలో దారుణమైన ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. సీనియర్ విద్యార్థులు తమపై వికృత చర్యలకు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీరియస్ అయిన యూజీసీ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చదవండి: ‘హ్యాపీడేస్‌’ మూవీని మించిన ర్యాగింగ్‌.. జూనియ‌ర్ అమ్మాయిల‌తో ఇంత దారుణమా..

మరిన్ని వార్తలు