రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

19 Feb, 2021 18:32 IST|Sakshi

హరియాణాలో ఘటన.. సర్వత్రా ఆగ్రహం

రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా?: కాంగ్రెస్‌

చంఢీగడ్‌: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

సోనిపట్‌ జిల్లాలోని బయాన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు రాజేందర్‌ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్‌ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రణదీదీప్‌ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

మరిన్ని వార్తలు