భావ ప్రకటనా స్వేచ్ఛపై భారత్‌కు చెప్పక్కర్లేదు! 

20 Jun, 2021 08:34 IST|Sakshi

సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ చురక 

పుణె: ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛపై భారత్‌కు లెక్చర్లు ఇవ్వాల్సిన పనిలేదని సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చురకలంటించారు. ఇలాంటి సంస్థలను ‘‘లాభార్జన సంస్థలు’’గా నిర్వచించిన ప్రసాద్, ఈ కంపెనీలు భారత్‌లో సంపాదించాలనుకుంటే తప్పక భారత రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలని స్పష్టం చేశారు. ‘‘సోషల్‌ మీడియా అండ్‌ సోషల్‌ సెక్యూరిటీ’’ మరియు ‘‘క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ రిఫామ్స్‌’’ అనే అంశాలపై సింబయాసిస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. కొత్త ఐటీ చట్టాలు సోషల్‌ మీడియా వాడకాన్ని నిరోధించవని, కేవలం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దుర్వినియోగం చేయడాన్ని నిరోధిస్తాయని వివరించారు.

కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్‌ మీడియా కంపెనీలు ఫిర్యాదుల పరిష్కార అధికారి, కంప్లైయన్స్‌ అధికారి, నోడల్‌ అధికారిగా భారత సంతతికి చెందినవారిని నియమించాలన్నారు. ఇదేమీ అసాధ్యమైన పనికాదన్నారు. అమెరికాలో ఉంటూ మనదగ్గర లాభాలు పొందుతున్న కంపెనీల నుంచి భావప్రకటనా స్వేచ్ఛపై సందేశాలు వినాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. దేశీయ కంపెనీలు అమెరికాలో వ్యాపారానికి వెళితే అక్కడి చట్టాలను పాటించినట్లే, అక్కడి కంపెనీలు ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడి చట్టాలను పాటించాలని హితవు పలికారు. ఎవరినైనా విమర్శించండి, కానీ ఇక్కడి చట్టాలను మాత్రం పాటించమంటే కుదరదన్నారు. భారత్‌లో వ్యాపారం చేయాలంటే ఇక్కడి రాజ్యాంగాన్ని అనుసరించితీరాలన్నారు. కొత్త చట్టాల అమలుకు ఈ సంస్థలకు అదనపు సమయం ఇచ్చామని, కానీ అవి నియమాలను అనుసరించలేదని గుర్తు చేశారు. చట్టాలకు అనుగుణ మార్పులు చేయనందున ఇకపై ఈ కంపెనీలు కోర్టుల చుట్టూ తిరగకతప్పదన్నారు.
 

చదవండి: 70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి 

మరిన్ని వార్తలు