రాజ్యసభ రగడ : క్షమాపణ కోరితే సస్పెన్షన్‌పై పునరాలోచన

22 Sep, 2020 15:48 IST|Sakshi

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై సస్పెన్షన్‌ వేటును ఉపసంహరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్‌ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ తొలుత సభ నుంచి వాకౌట్‌ చేయడా ఆపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు వాకౌట్‌ చేశాయి. రాజ్యసభలో తమ ప్రవర్తనపై సస్పెన్షన్‌కు గురైన సభ్యులు క్షమాపణ కోరితే ప్రభుత్వం వారిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

రాజ్యసభలో విపక్షాల అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని తాము భావించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్‌కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్‌ ట్వీట్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం రాహుల్‌ ఆమె వెంట విదేశీ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ్యసభ టేబుల్‌పైకి ఎక్కి నృత్యం చేస్తూ కాగితాలను చించివేసిన కాంగ్రెస్‌ ఎంపీని తాము ఇంతవరకూ చూడలేదని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం​ పొందేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం​ సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

చదవండి : ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు