త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్‌ చర్చలు

29 Aug, 2021 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీశ్‌ రావత్‌ ముందుకొచ్చారు. త్వరలో పంజాబ్‌లో పర్యటించి అమరీందర్, సిద్ధూలను కలుస్తానని, సయోధ్యకు ప్రయత్నిస్తానని రావత్‌ ప్రకటించారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో విభేదాలపై పార్టీ నేత రాహుల్‌గాంధీతో ఆయన శనివారం చర్చించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు మూడు రోజుల్లో నేను పంజాబ్‌కి వెళతాను.

సయోధ్య కుదిర్చేందుకు అమరీందర్, సిద్ధూలతో మాట్లాడతాను. పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేత లందరితోనూ మాట్లాడతాను’ అని రావత్‌ చెప్పారు. గత కొన్ని నెలలుగా అంతర్గత పోరుతో కాంగ్రెస్‌ పార్టీ అల్లాడిపోతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఈ వర్గ పోరు ఒక కొలిక్కి రాలేదు. సిద్ధూ సలహాదారు మాల్వీందర్‌ సింగ్‌ కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీఎం శిబిరం ఒత్తిడితో ఆయన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు తాను డమ్మీ చీఫ్‌గా ఉండలేనని, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం కావాలని సిద్ధూ డిమాండ్‌ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యని అధిష్టానం ఎలా పరిష్కరించనుందో వేచి చూడాలి. 

>
మరిన్ని వార్తలు