ఆర్బీఐ లోపాలే.. లోన్‌ యాప్‌లకు లాభాలు!

12 Feb, 2021 16:58 IST|Sakshi

సర్వీస్‌ చార్జీలపై స్పష్టత ఇవ్వని రిజర్వ్‌ బ్యాంక్‌

గరిష్ట వడ్డీ మాత్రం 36 శాతంగా నిర్దేశించిన వైనం

వీటిని అనుకూలంగా మార్చుకున్న చైనా యాప్స్‌

వంత పాడి సహకరించిన దేశీయ ఎన్‌బీఎఫ్‌సీలు

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌ వ్యవహారాలకు పాల్పడిన చైనా లోన్‌ యాప్స్‌ కేసుల దర్యాప్తులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. అవసరార్థులకు రుణాల మంజూరు, వడ్డీ వసూళ్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో ఉన్న లోపాలనే చైనా యాప్స్‌ తమకు అనుకూలంగా మార్చుకున్నాయని తేల్చారు. వీటికి దేశంలోని వివిధ మెట్రో నగరాలకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) సహకరించినట్లు గుర్తించారు. ఇటీవల సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో ఆర్బీఐ సహా వివిధ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు విభాగం తమ దర్యాప్తులో గుర్తించిన వ్యవస్థాగత లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. రాజధానిలోని మూడు కమిషనరేట్లలోనూ నమోదైన కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రూపొందించి ఆర్బీఐకి పంపాలని నిర్ణయించింది.  

ఒప్పందం చేసుకుని జంప్‌.. 
ఇక అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌ యాప్స్‌తో పాటు బలవంతపు రివకరీల కోసం కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది చైనాకు చెందిన సంస్థలే అని తేలింది. అయితే రుణాలు ఇవ్వడానికి వినియోగించిన నగదు మాత్రం దేశం బయట నుంచి రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా మరికొన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలతో చైనా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రుణాలు అందించడానికి, తిరిగి వసూలు చేయడానికి అవసరమైన ఫ్లాట్‌ఫామ్స్‌ (యాప్స్, కాల్‌ సెంటర్లు) తాము రూపొందిస్తామని, ఆయా కస్టమర్లకు రుణాలు మాత్రం మీరు ఇవ్వాలంటూ చైనా కంపెనీలు ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పత్రాలపై సంతకాలు చేసిన సమయంలో మాత్రమే సూత్రధారులైన చైనీయులు ఎన్‌బీఎఫ్‌సీ నిర్వాహకుల్ని కలిశారు. ఆపై వాళ్లు పత్తాలేకుండా పోయి తమ అనుచరుల ద్వారా ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టారు.  

సర్వీసు చార్జీల కింద కొంత.. వడ్డీ పేరిట అంత! 
ఇక ఎన్‌బీఎఫ్‌సీలు - చైనా కంపెనీలు ఆర్బీఐ నిబంధనల్లో ఉన్న లోపాలను అధ్యయనం చేశాయి. అప్పులపై వసూలు చేసే వడ్డీ ఏడాదికి 36 శాతం దాటకూడదంటూ ఆయా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్లలో రుణాలు మంజూరు చేసేప్పుడు ఆయా కంపెనీలు సర్వీస్‌ చార్జ్‌ కింద గరిష్టంగా ఎంత మొత్తం వసూలు చేయాలనేది మాత్రం ఆర్బీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. దీన్నే చైనా కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు తమకు కలసి వచ్చే అంశంగా మార్చుకున్నాయి. 

రూ.5 వేల రుణానికి రూ.1200 చొప్పున సర్వీసు చార్జ్‌ కింద మినహాయించుకుని రుణగ్రహీతకు రూ.3,800 మాత్రమే చెల్లించాయి. ఈ రుణాన్నీ వారం రోజుల్లో తిరిగి చెల్లించేలా నిబంధన విధించాయి. ఆ సమయంలో వడ్డీగా మాత్రం కేవలం రూ.15 నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం సరాసరిన చూస్తే ఏడాదికి 25 శాతం లోపే ఉంటోంది. వడ్డీ మొత్తం ఎన్‌బీఎఫ్‌సీలకే వెళ్తున్నప్పటికీ సర్వీస్‌ చార్జీని మాత్రం వీరిలో పాటు యాప్, కాల్‌ సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారు. మరోపక్క ఈ లోన్‌ యాప్స్‌ లావాదేవీలపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 3

వీటి ద్వారా రుణగ్రస్తులకు నగదు ఇచ్చిన, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించిన రోజర్‌పే సంస్థ అందించిన వివరాల ప్రకారం ఆయా ఎన్‌బీఎఫ్‌సీల టర్నోవర్‌ రూ.25 వేల కోట్ల వరకు ఉంది. అయితే ఎన్‌బీఎఫ్‌సీలు కేవలం లోన్‌ యాప్స్‌ ద్వారా అప్పులు ఇవ్వడమే కాకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వస్తోందని పోలీసులు చెప్తున్నారు. ఇందులో కేవలం రుణ యాప్‌ల ద్వారా మాత్రమే జరిగిన లావాదేవీలు ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ లోన్‌ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. 

ఒకప్పుడు ఇవి ఫోన్లు, సందేశాలు, సోషల్‌ మీడియా ద్వారా డిఫాల్టర్లను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. అయితే వీటిపై కేసుల నమోదు, నిందితుల అరెస్టులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్‌ వంటి చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎగవేతదారులకు ఫోన్లు చేస్తున్న కాల్‌ సెంటర్ల వారు చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కట్టలేకుంటే సర్వీసు‌ చార్జ్, వడ్డీ మినహాయించి అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని కోరుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై వచ్చే ఫిర్యాదులు లేవని పేర్కొంటున్నారు.  

రూ.320 కోట్లు ఫ్రీజ్‌ చేశాం.. 
లోన్‌ యాప్స్‌ కేసులకు సంబంధించి ఇప్పటివరకు చైనా జాతీయుడి సహా 20 మందిని అరెస్టయ్యారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.320 కోట్లు ఫ్రీజ్‌ చేశాం. గతంలో నమోదైన కలర్‌ ప్రిడెక్షన్‌ కేసులో రూ.105 కోట్లు హాంకాంగ్‌లోని బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు గుర్తించాం. ఏదైనా యాప్‌ వ్యవహారాలపై అనుమానం వస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్కడ ఓ బృందం వీటిపైనే 24 గంటలూ పని చేస్తుంటుంది. 
-- అంజనీకుమార్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

చదవండి:

"వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది!

తీపి కబురు: దిగొచ్చిన బంగారం ధరలు!

మరిన్ని వార్తలు