రూ.100 నోటు షాకింగ్‌ న్యూస్‌!

23 Jan, 2021 10:33 IST|Sakshi

పాత 100, 10, 5 కరెన్సీ నోట్లను రద్దు చేయనున్న ఆర్‌బీఐ?

 హింట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్

సాక్షి, న్యూఢిల్లీ:  అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలకు  షాకిచ్చిన కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనుం దా? తాజా వార్తలు, సాక్షాత్తు ఆర్‌బీఐ కీలక అధికారి  దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు  ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. 2021 ఏడాదిలో మరో షాకింగ్‌ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి  ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్‌డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు  కేంద్ర బ్యాంకు  యోచిస్తున్నట్లు ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ శుక్రవారం వెల్లడించారు.

జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్‌లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్‌ఎస్‌సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (డిఎల్‌ఎంసి) సమావేశంలో బీ మహేష్ మాట్లాడుతూ రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్‌ ఇచ్చారు. అలాగే 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలామంది వాటిని అంగీకరించడానికి ఇష్టపడ్డంలేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండటంతో బ్యాంకులు, ఆర్‌బీఐకి సమస్యగా మారిందన్నారు.  ఈ నేపథ్యంలో 10  రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మరి  పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.   దీనికి సంబంధించి ఆర్‌బీఐ  అమలుచేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. 

కాగా నవంబర్ 8, 2016లో  రూ.500,1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది.  2019 లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్‌చల్‌  చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్‌బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు