ఫైర్ పవర్ తగినంత ఉంది : శక్తికాంత దాస్

27 Aug, 2020 15:00 IST|Sakshi

భవిష్యత్తులో కీలక వడ్డీరేటు కోత అంచనాలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన శక్తి సామర్థ్యాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద మెండుగా ఉన్నాయని, మొత్తంమీద భారత బ్యాంకింగ్ వ్యవస్థ ధృఢంగానే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. ఈ సంక్షోభం ముగిసిన అనంతరం ఆర్థిక స్థిరీకరణకోసం చాలా జాగ్రత్తగా, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత చర్యలను  ఆర్‌బీఐ చేపట్టనుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు.  తద్వారా  భవిష్యత్తులో కీలక వడ్డీరేటు కోత లుంటాయనే సంకేతాలందించారు.  ఒక వెబ్‌నార్ సిరీస్ ఈవెంట్ ముఖ్య ప్రసంగంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యల్ని వెంటనే నిలిపివేయడం లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యల్నినిలిపివేసిందన్నఊహాగానాలకు అర్థం లేదన్నారు.  సంబంధిత చర్యలపై ఆర్‌బీఐ దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా రేట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి ఎలా ఉండబోతోందనే దానిపై స్పష్టత రాగానే ద్రవ్యోల్బణం, అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేస్తుందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రేట్ల కోత అయినా, లేదా ఇతర విధానపరమైన  చర్యలయినా ఆర్‌బీఐ దగ్గర అస్త్రాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ  భరోసా ఇచ్చారు.  

మహమ్మారి  కట్టడి అనంతరం  ఆర్థిక రంగం సాధారణ స్థితికి చేరుకునేందుకు జాగ్రత్తగా బాటలు వేయాల్సిన అవసరం ఉందని దాస్ ఉద్ఘాటించారు. ఏదేమైనా,  ఈ చర్యలను త్వరలోనే  ముగిస్తుందని ఏ కోణంలోనూ భావించరాదని ఆయన స్పష్టం చేశారు. అతిగా రక్షణాత్మక వైఖరి అవలంబించడం ద్వారా చివరికి బ్యాంకులకే నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. కరోనా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ మంచి ఉపశమనం ఇస్తుందని చెప్పారు. లాక్‌డౌన్ సందర్భంలోరుణాలపై తాత్కాలిక నిషేధం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. ఈ సమయంలో బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనేది స్పష్టం..కానీ, ఈ సవాళ్లకు ఎలా స్పందిస్తాయి, ఎలా ఎదుర్కొంటాయినేది కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు మహమ్మారిపై కట్టడిలో కేంద్రం ప్రభుత్వం స్పందించిన తీరునున దాస్ ప్రశంసించారు. 

>
మరిన్ని వార్తలు