లాక్‌డౌన్ భయం‌: ‘మళ్లీ ఊరెళ్లిపోతా మామ’

8 Apr, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఊరెళ్లి పోతా మామ.. ఊరెళ్లి పోతా’ అంటూ మళ్లీ వలస కార్మికులు, కూలీలు పల్లె బాట పట్టారు. కరోనా వైరస్‌ రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభణ కొనసాగడంతో అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్‌డౌన్‌ మినహా అన్ని చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వలసవెళ్లిన కార్మికులు, కూలీలు ఊరి బాట పడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండడంతో ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ.. పగటి పూట పని వేళల మార్పు చేయడం పొట్ట పోసుకోవడానికి వచ్చిన కార్మికులు మళ్లీ తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఉండడం కన్నా ఊర్లో ఉండడం మేలు అనే భావనతో తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు. 

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయంతో ఇప్పుడే ఊరెళ్లడం నయమని భావించి తట్టాబుట్టా సర్దేసుకుని మళ్లీ ఊరి బాట పడుతున్నారు. ఢిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 దాక కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో మినీ లాక్‌డౌన్‌ విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌ కూడా విధించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు ఆ పట్టణాల్లో ఉండలేక స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతేడాది అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో పడ్డ కష్టాలను తలుచుకుని ఇప్పుడు ముందే జాగ్రత్త పడుతూ ఊరికి వెళ్తున్నారు. 

మరిన్ని వార్తలు