నిర్మలా సీతారామన్‌తో పనిచేయడం కష్టం..

31 Oct, 2020 17:05 IST|Sakshi

 నా బదిలీకి ఆమె పట్టుబట్టారు: సుభాష్ చంద్ర గార్గ్

నిర్మలతో పనిచేయడం కష్టం అనుకున్నా..అందుకే రిజైన్ చేశా

బదిలి చేసిన అర్ధగంటలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా

ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయా!

అరుణ్ జైట్లీ  ఒక మాస్టర్ మైండ్ 

సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో  కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమె‌తో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. 

తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి  కేంద్రం పక్కకుపోయిందనీ,  ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.

అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్‌కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ  క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్‌లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు.  అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే  స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు.  ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు