Presidential Election 2022: ఈవీఎం బదులు బ్యాలెట్‌ పేపర్లు ఎందుకో తెలుసా?

18 Jul, 2022 12:37 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. 

రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్‌ రోజున క్షణాల్లో చూపించేస్తుంది.  

రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్‌ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్‌ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. 

బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్‌ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు.  మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా.  ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు.

మరిన్ని వార్తలు